సుశాంత్ డెత్ ఇన్వెస్టిగేషన్ : రియా చక్రవర్తి కోసం 24 ప్రశ్నలు సిద్ధం చేసిన సీబీఐ

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే, అయితే కేసుకు సంబంధించి ప్రధాన అంశాలను సిట్ పరిశీలిస్తోంది. సీబీఐ టీమ్ సుశాంత్ సింగ్ బాంద్రా నివాసంలో అసలు ఎలా మరణించాడు అనే మిస్టరీని తెలుసుకోవడం కోసం డెత్ సీన్ ని రీ క్రియేట్ చేశారు. అలాగే సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పిథానిని కూడా అధికారులు అనేక రకాల విషయాలపై విచారణ జరిపారు.

ఇక నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తుండగా.. తాజా నివేదికల ప్రకారం రియా చక్రవర్తిని ప్రశ్నించడానికి పిలిచినప్పుడు సిట్ అధికారులు 24 ప్రశ్నలు సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. రియా సుశాంత్ జీవితంలోకి ప్రవేశించిన తరువాత ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి అసలు అతని మరణానికి రియా ఎంతవరకు కారణం ? అసలు హత్య జరిగితే ఆమెకు ఏమైనా సంబంధం ఉందా లేదా అనే తరహాలో ప్రశ్నలు సిద్ధం చేసినట్లు సమాచారం. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు ఈ రోజు ఐదవ రోజులోకి ప్రవేశించడంతో, విచారణ కోసం రియా చక్రవర్తిని ఎప్పుడైనా ఏజెన్సీ పిలిపించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక రియా చక్రవర్తి విచారణ కోసం వచ్చినప్పుడు సిబిఐ బృందం సుమారు 24 ప్రశ్నలతో సిద్ధంగా ఉంటుందని తెలుస్తోంది.