రజనీ షూటింగ్‌కు బ్రేక్.. 8 మందికి కరోనా

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం సిరుతై శివ డైరెక్షన్‌లో ‘అన్నాతే’ అనే మూవీలో నటిస్తున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాలో నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బు, ప్రకాష్ రాజ్‌లు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. రజనీ 168వ సినిమాగా ఇది తెరకెక్కుతుండగా.. 60 శాతం షూటింగ్ లాక్‌డౌన్‌కు ముందే పూర్తి అయినట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్ తర్వాత తిరిగి తాజాగా షూటింగ్ ప్రారంభమవ్వగా.. ఇందులో పాల్గొనేందుకు రజనీ చెన్నై నుంచి హైదరాబాద్‌కు స్పెషల్ ప్లైట్‌లో ఇటీవల వచ్చారు.

RAJANIKANTH

రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ షూటింగ్ జరుగుతుండగా.. రజనీ, నయనతార మధ్య కొన్ని సీన్లు తెరకెక్కించారు. కానీ తాజాగా రజనీ షూటింగ్‌లో 8 మంది యూనిట్ సభ్యులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. దీంతో షూటింగ్‌ను ఆపివేసినట్లు సమాచారం. షూటింగ్ నిలిచిపోవడంతో రజనీకాంత్ కూడా చెన్నై నుంచి హైదరాబాద్ బయలుదేరనున్నారని తెలుస్తోంది.

త్వరలో తమిళనాడు ఎన్నికలు జరగనున్న క్రమంలో పొలిటికల్ పార్టీ ప్రారంభిస్తున్నట్లు ఇటీవల రజనీ ప్రకటించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 31న పార్టీ గురించి ప్రకటన చేస్తానని, జనవరిలో పార్టీ ప్రారంభిస్తానని ఇటీవల రజనీ ట్వీట్ చేశారు. డిసెంబర్ 31లోపు ఈ చివరి షెడ్యూల్ షూటింగ్ ముగిస్తే.. రాజకీయాల్లో బిజీ కావొచ్చని రజనీ భావించారు. కానీ ఇప్పుడు అర్థాంతరంగా షూటింగ్ ఆగిపోవడంతో.. ఈ సినిమా కంప్లీట్ కావడానికి మరికొద్దిరోజులు సమయం పట్టే అవకాశముంది.