
ఈ రోజు తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజు. నందమూరి తారకరామారావు గారు నటించిన జానపద చిత్రం డి.వి.ఎస్. ప్రొడక్షన్స్ మంగమ్మ శపథం 1965 మార్చి 6న విడుదలై నేటికి 60 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని, ఎవర్ గ్రీన్ క్లాసిక్గా నిలిచింది.
నిర్మాత డి.వి.ఎస్.రాజు గారు డి.వి.ఎస్. బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రాన్నికి జానపదబ్రహ్మ ప్రముఖ దర్శకుడు బి.విఠలాచార్య దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ గారికి అత్యంత సన్నిహితులు, ఆత్మీయులైన డి.వి.ఎస్.రాజు గారు ఎన్టీఆర్ గారితో స్వంతం గా చిత్ర నిర్మాణం చేపట్టాలనే తలంపుతో తమిళం లో విజయవంతం అయిన చిత్రానికి ప్రాచుర్యంలో ఉన్న జానపద కధను జోడించి జానపదబ్రహ్మ విఠలాచార్య దర్శకత్వంలో చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించారు నిర్మాత డి.వి.ఎస్.రాజ గారు. తమ స్వంత నిర్మాణ సంస్థ డి.వి.ఎస్. బ్యానర్ పై నిర్మించిన తొలి చిత్రం” మంగమ్మ శపథం”. కాగా ఈ చిత్రాన్నికి కో-డైరెక్టర్ గాఎస్.డి.లాల్ వ్యవహరించారు.
ఈ చిత్రం ఒక రాజ్యం నేపథ్యంలో సాగుతుంది. రాజు (ఎన్.టి.ఆర్) మరియు మంగమ్మ (జమున) మధ్య జరిగిన సంఘర్షణ, ప్రేమ, ప్రతీకారం, మరియు కుటుంబ విలువలను చక్కగా చూపిస్తుంది. మంగమ్మ తన ప్రతిజ్ఞను నెరవేర్చడానికి చేసిన ప్రయత్నాలు, రాజును తన తప్పులను అంగీకరించడానికి ప్రేరేపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
టీవీ రాజు సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు అప్పట్లో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. సి.నారాయణ రెడ్డి మరియు కోసరాజు లిరిక్స్ రాశారు. ఎన్టీఆర్ గారు ద్విపాత్రాభినయం చేసిన తొలి జానపద చిత్రం “మంగమ్మ శపథం”. ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను విశేషం గా ఆకర్షించింది.
ఈ చిత్రం విజయవంతమై విడుదలైన దాదాపుగా అన్ని కేంద్రాలలో 50 రోజులు, డైరెక్ట్ గా నాలుగు కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడింది. నేటికీ ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది.
మంగమ్మ శపథం 60 ఏళ్లను పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ చిత్రాన్ని గుర్తుచేసుకుంటూ, తెలుగు సినిమా చరిత్రలో ఈ చిత్రానికి ఉన్న ప్రత్యేక స్థానం గురించి మనం గర్వపడవచ్చు.