30 ఏళ్ళు పూర్తి చేసుకున్న టైమ్‌లెస్ క్లాసిక్ ఆదిత్య 369

నందమూరి బాలకృష్ణ, లెజెండ్ సింగీతం శ్రీనివాస్‌తో కలిసి శ్రీ దేవి మూవీస్ బ్యానర్ పై భారతదేశపు మొదటి సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’ ను అందించిన సంగతి తెలిసిందే. తెలుగు ప్రేక్షకులు ‘టైమ్ మెషీన్’ అనే మాటను పెద్దగా వినని రోజుల్లో, ఆ నేపథ్యంలో తొలిసారిగా వచ్చిన ‘సైన్స్ ఫిక్షన్’ మూవీ ‘ఆదిత్య 369’ అని చెప్పాలి. మరోలా చెప్పాలంటే ఆనాటి పాన్ ఇండియా సినిమా ఇది. బాలకృష్ణ – మోహిని జంటగా ఓ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ కు సింగీతం తెరతీశారు. 1991లో జులై 18న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక స్పెషల్ పేజ్ క్రియేట్ చేసుకుంది. ఈ టైమ్‌లెస్ క్లాసిక్ రిలీజ్ అయ్యి రేపటికి 30 సంవత్సరాలు పూర్తి అవుతుంది. రేపు, ఆదిత్య 369 రిలీజ్ అయి మూడు దశాబ్దాలు పూర్తయిన సంధర్బంగా ఉదయం 10:26 గంటలకు ఒక ప్రత్యేక వీడియో విడుదలవుతోంది.

ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ తో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని ఫ్యాన్స్ కి బాలయ్య తన పుట్టినరోజు సందర్భంగా గుడ్ న్యూస్ వినిపించారు, దీంతో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి కూడా రేపు ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఏమేరకు ఉన్నాయో వేచి చూడాల్సి ఉంది.