ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా ‘మనదేశం’ సినిమా 75 సంవత్సరాల విజయోత్సవ వేడుకలు హైదరాబాద్ లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగాయి.

ఎన్టీఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీ ఆధ్వర్యంలో ‘ మన దేశం’ చిత్ర నిర్మాత శ్రీమతి కృష్ణవేణి, ఆ చిత్ర దర్శకుడు ఎల్.వి. ప్రసాద్ కుమారుడు రమేష్ ప్రసాద్, పూర్ణా పిక్చర్స్ అధినేత విశ్వనాథ్ ను ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీ చైర్మన్ జనార్దన్ మాట్లాడుతూ – ఇవాళ ‘మనదేశం’ సినిమా 75 సంవత్సరాల వేడుకలు, ఎన్టీఆర్ 28వ వర్ధంతి కార్యక్రమం రోజున జరుపుకుంటున్నాం. ఎందరో నాయకులు వస్తారు వెళ్తారు, కానీ ప్రజలకు సేవ చేసిన వారే చిరకాలం గుర్తుంటాయి. అలాంటి గొప్ప నాయకుడు ఎన్టీఆర్. 40 ఏళ్ల తర్వాత దేశానికి ఎలాంటి అవసరాలు ఉంటాయో ఊహించి ముందే చెప్పిన గొప్ప దూరదృష్టి గల నాయకుడు ఆయన. నటుడిగా ఎన్టీఆర్ గొప్పతనం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు అన్నారు. నిర్మాత ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ – తెలుగు సినిమా రంగంపై ఎన్టీఆర్ వేసిన ముద్ర చెరగనిది. నటుడిగా, నిర్మాతగా, స్టూడియో ఓనర్ గా, దర్శకుడిగా తెలుగు సినిమా అభివృద్ధికి బాటలు వేశారు. ఎన్టీఆర్ రాజకీయ నాయకుడిగా ప్రజాసేవ చేశారు. ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆ తర్వాతి ముఖ్యమంత్రులు కొనసాగించారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ‘మనదేశం’ 75 సంవత్సరాల వేడుక చేయడం సముచితంగా ఉంది. అన్నారు. నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ – ఎన్టీఆర్ మన మధ్య లేకున్నా, ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. ఇవాళ ఎన్టీఆర్ సెంటనరీ సెలబ్రేషన్స్ కమిటీ ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని, వజ్రాన్ని కూడా సానపట్టాలి. అలా ‘మనదేశం’ సినిమాలో అ‌వకాశం ఇచ్చి ఎన్టీఆర్ ను నటుడిగా మెరుగులు దిద్దింది ఎల్వీ ప్రసాద్, కృష్ణవేణి అమ్మగారని వారికి మా కుటుంబం ఎంతో రుణపడి ఉంటుందని చెప్పారు. శ్రీమతి కృష్ణవేణి గారు మాట్లాడుతూ ఇంతమంది పెద్దల సమక్షంలో మేము నిర్మించిన ‘మనదేశం’ చిత్రం 75 సంవత్సరాల వేడుక జరగటం, ఆ సినిమా ద్వారా రామారావుగారిని మేము పరిచయం చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ – ఇవాళ ‘మనదేశం’ సినిమా స్వర్ణోత్సవ వేడుకలు, ఎన్టీఆర్ 28వ వర్థంతి కార్యక్రమం జరపడం, ఈ సందర్భంగా మాకు సత్కారం చేయడం సంతోషంగా ఉంది. నాన్న ఎల్వీ ప్రసాద్ గారు ఎంతో కష్టపడి పరిశ్రమలో ఎదిగారు. ఆయన కృషి వల్లే మేము ఇవాళ సినిమా రంగంలో ఒక భాగంగా కొనసాగడమే కాదు ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ తో పేద ప్రజలకు సేవ చేయగలుగుతున్నాం. ఎన్టీఆర్ తో నాన్న గారికి మంచి అనుబంధం ఉండేదని, ఎన్టీఆర్ ను మనమంతా నిత్యం స్ఫూర్తిగా తీసుకోవాలి అన్నారు. పూర్ణా పిక్చర్స్ విశ్వనాధ్ గారు మాట్లాడుతూ రామారావు గారు నటించిన ‘పల్లెటూరి పిల్ల’ సినిమాను తాము ఆంధ్రప్రదేశ్ అంతటా విడుదల చేశామని, ఆ తరువాత వారు నటించిన 30కి పైగా సినిమాలు తామై పంపిణీ చేశామని, రామారావుగారి కుటుంబంతో ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. నిర్మాతల మండలి తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ రామారావు లాంటి మరో నటుడు, నాయకుడు పుట్టరని ఆయనకు ఆయనే సాటి అని చెప్పారు. ఎన్.టి.ఆర్. స్మారక నాణేన్ని ముద్రించటం తమ అదృష్టమని, ఆ నాణాన్ని ఇప్పటికే 25 వేలకు పైగా అమ్మామని, ఇది దేశంలోనే రికార్డ్ అని హైదరాబాద్ మింట్ శ్రీనివాస్ తెలిపారు. ఎన్.టి.ఆర్. కార్యక్రమాన్ని సీనియర్ జర్నలిస్ట్ కమిటీ సభ్యుడు భగీరథ సమన్వయం చేయగా దొప్పలపూడి రామమోహనరావు, అట్లూరి నారాయణరావు, విక్రమ్ పూల, మండవ సతీష్, శ్రీపతి సతీష్ అతిథులను పుష్పగుచ్చాలతో సత్కరించారు.