
తెలుగుతో పాటు తమిళంలో పలు హిట్ మూవీస్, వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో నవీన్ చంద్ర. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా “28°C”. ఈ చిత్రాన్ని ఎమోషనల్ థ్రిల్లర్ లవ్ స్టోరీతో రూపొందించారు “పొలిమేర” ఫేమ్ డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్. “28°C” చిత్రాన్ని వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్ సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు. నవీన్ చంద్ర సరసన షాలినీ వడ్నికట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ నెల 4వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో “28°C” మూవీలో నటించిన ఎక్సిపీరియన్స్ తెలిపారు హీరో నవీన్ చంద్ర.
- ఆరేళ్ల కిందట ఈ మూవీ జర్నీ బిగిన్ అయ్యింది. ఒకరోజు రెస్టారెంట్ లో ఉండగా డా. అనిల్ విశ్వనాథ్ కలిసి తన దగ్గర స్టోరీ ఉందని చెప్పారు. రెండ్రోజుల తర్వాత కథ విన్నాను. చాలా యూనిక్ గా అనిపించింది. 28 డిగ్రీల టెంపరేచర్ లో తన జీవిత భాగస్వామిని కాపాడుకునే వ్యక్తి కథ ఇది. ఈ క్రమంలో ఆ జంట చేసిన ఎమోషనల్ జర్నీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆసక్తికరంగా సాగుతుంది. వినగానే ఈ కథ కొత్తగా ఉందని అనిపించింది. అప్పటికి నాపై అందాల రాక్షసి మూవీ ఎఫెక్ట్ చాలా ఉండేది. ఆ మూవీ తర్వాత కొన్ని వేరే జానర్ మూవీస్ చేసినా లవ్ స్టోరీ మూవీస్ లో ఎక్కువ ఆఫర్స్ వచ్చేవి. “28°C” సినిమాను బిగిన్ చేశాం. ఆ మూవీలో నేను తప్ప మిగతా అంతా కొత్త వాళ్లే. ఫస్ట్ డే షూటింగ్ తర్వాత డైరెక్టర్ అనిల్ మూవీని బాగా తెరకెక్కించగలడనే నమ్మకం ఏర్పడింది.
- “28°C” సినిమా రెండు ప్రాంతాల్లో జరుగుతుంది. ఒకటి వైజాగ్, రెండోది జార్జియా. ఫస్ట్ అమెరికా అనుకున్నాం కానీ ఆ టైమ్ లో విదేశీ ఆర్టిస్టులకు ఎంట్రీ కష్టంగా ఉండేది. జార్జియా వెళ్లినప్పుడు కూడా రెండుసార్లు రిజెక్ట్ అయి వెనక్కి వచ్చాం. ఆ తర్వాత లోకల్ గా ఈ వార్త బాగా ప్రచారం కావడంతో మళ్లీ చిత్రీకరణకు పర్మిషన్ ఇచ్చారు.
- మన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా సమస్య ఉంటే మనం ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. అప్పుడు కష్టం కూడా ఇష్టంగా మారుతుంది. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అయిన కార్తీక్, అంజలి ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. వాళ్లిద్దరు డాక్టర్స్ గా సెటిల్ అవుతారు. అయితే అంజలికి అనారోగ్య సమస్య వల్ల ఆమెను 28 డిగ్రీ టెంపరేచర్ లోనే చూసుకోవాలి. ఇలా నిజంగా ఎవరికీ జరగదు. పుస్తకాల్లో ఉన్న ఒక థియరీని తీసుకుని దాన్ని సినిమాటిక్ గా మలిచారు మా డైరక్టర్. డాక్టర్ కాబట్టి అనిల్ విశ్వనాథ్ సినిమాలో మెడికల్ టర్మ్స్ చాలా డీటెయిల్డ్ గా రాశారు.

- ఏ హీరోకైనా సక్సెస్, ఒక మార్కెట్ ఉండాలి. లేకుంటా ఆయన సినిమాల రిలీజ్ లకు ఇబ్బందులు తప్పవు. ఆ టైమ్ లో నా మూవీస్ కొన్ని ఆడకపోవడం వల్ల “28°C” సినిమాకు బిజినెస్ జరగలేదు. అప్పటికి థ్రిల్లర్ జానర్ మూవీస్ ఇంతగా లేవు. ఇది లవ్ అండ్ థ్రిల్లర్ కాబట్టి సినిమా ఎవరికి చూపించినా కొన్ని ఛేంజెస్ చెప్పేవారు. సినిమాలో అది మార్చు ఇది మార్చు అని డైరెక్టర్ గారిని చాలా ఇబ్బంది పెట్టారు. ఓటీటీల్లో కూడా సరైన ఆఫర్స్ రాలేదు. పైగా మా మూవీని థియేటర్స్ లో రిలీజ్ చేయాలనే పట్టుదల మా డైరెక్టర్ అనిల్, ప్రొడ్యూసర్ సాయి అభిషేక్ లో ఉండేది. పొలిమేర సక్సెస్ తర్వాత ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి గారు “28°C” సినిమా చూసి ఇంత మంచి ఎమోషన్, డ్రామా ఉన్న సినిమాను ఎందుకు రిలీజ్ చేయలేదు, నేను రిలీజ్ చేస్తా అని ముందుకొచ్చారు. “28°C” థియేటర్ లోనే కాదు రేపు టీవీ, ఓటీటీ ఏ వేదిక మీద రిలీజైనా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. మంచి ఓపెనింగ్స్ వచ్చి, ఆడియెన్స్ మౌత్ టాక్ తో థియేటర్స్ లో మూవీ ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాం. నా క్యారెక్టర్ వరకు ఎంత బాగా పర్ ఫార్మ్ చేయాలో అంత బాగా పర్ ఫార్మ్ చేశాను.
- కోవిడ్ తర్వాత థ్రిల్లర్స్, యాక్షన్ మూవీస్ ఎక్కువయ్యాయి. మూవీస్ లో హింస పెరిగింది. సొసైటీలో కూడా హింస పెరిగింది. ఎక్కడ చూసినా క్రైమ్ న్యూస్ వింటూనే ఉన్నాం. సినిమాల్లోనూ అలాంటి క్రైమ్స్ చూసేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నేను హీరోగా చేసే సినిమాలకు ప్రొడక్షన్ సైడ్ స్ట్రాంగ్ గా ఉన్నారా లేదా అని చూసుకుంటున్నాను. క్యారెక్టర్స్ చేస్తే అది లైఫ్ లీడ్ చేయడానికి, కొంత డబ్బు సంపాదించడానికి, నా క్రాఫ్ట్ ను కెరీర్ ను లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తున్నా.
- అరవింద సమేత వీర రాఘవలో నేను చేసిన క్యారెక్టర్ కు చాలా మంచి పేరొచ్చింది. నా కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఇప్పుడు అదే బ్యానర్ లో రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర చిత్రంలో ఓ సరికొత్త క్యారెక్టర్ లో నన్ను చూస్తారు. గేమ్ ఛేంజర్ లో ఉండిపోవడం వల్ల సూర్య రెట్రో మూవీలో మెయిన్ విలన్ గా నటించే అవకాశం మిస్ అయ్యింది. ఇప్పుడు ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ లో షో టైమ్ తో పాటు 11 అనే మరో మూవీ ఉంది. నాకు బాగా పేరు తెచ్చిన ఇన్ స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ సీజన్ 2 రాబోతోంది.