గోవాలో సినీ సంబరం – IFFI 2026

ప్రపంచ సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూసే 57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేడుకలకు గోవా సిద్ధమవుతోంది. నవంబర్ 20 నుంచి 28 వరకు తొమ్మిది రోజుల పాటు ఈ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ఈసారి ‘స్టోరీస్ వితౌట్ బోర్డర్స్’ (సరిహద్దులు లేని కథలు) అనే థీమ్‌తో వేడుకలను నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 86 దేశాలకు చెందిన సినిమాలతో పాటు భారతీయ చిత్రాలు కూడా ఈ ఫెస్టివల్‌లో సందడి చేయనున్నాయి. మొత్తంగా ప్రపంచ సినిమాను ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా ఈసారి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈసారి IFFIలో తెలుగు సినిమాలకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇండియన్ పనోరమా విభాగంలో తెలుగు నుంచి రెండు చిత్రాలు ఎంపికయ్యాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన ‘సింగ్ గీతం’ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో చోటు దక్కించుకుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ నటించిన అనిల్ రావిపూడి చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మెయిన్‌స్ట్రీమ్ సినిమా విభాగానికి ఎంపికైంది. ఒకవైపు ప్రయోగాత్మక సినిమాకు, మరోవైపు కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు చోటు దక్కడం తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రత్యేకమైన విషయమే.

హిందీ సినిమాల విషయానికి వస్తే.. ఇండియన్ పనోరమా ఫీచర్ ఫిల్మ్ విభాగాన్ని ‘ధురంధర్’ చిత్రంతో ప్రారంభించనున్నారు. మరోవైపు భారతీయ ఇతిహాస కథాంశంతో తెరకెక్కిన ‘రామాయణ’కు కూడా అంతర్జాతీయ వేదికపై ప్రత్యేక స్థానం దక్కింది. BRICS దేశాల సినిమాల విభాగాన్ని ఈ చిత్రంతోనే ప్రారంభించనున్నారు. ఇక దక్షిణాది భాషలతో పాటు ఇతర భారతీయ భాషలకు చెందిన సినిమాలు కూడా ఇండియన్ పనోరమాలో భాగం కానున్నాయి. మొత్తం 18 భాషలకు చెందిన 76 చిత్రాలను ఈ విభాగంలో ప్రదర్శించనున్నారు. లడఖీ భాషా చిత్రం ‘బికమింగ్’ నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగానికి ప్రారంభ చిత్రంగా నిలవనుంది.

అంతర్జాతీయ సినిమాల పరంగా కూడా ఈసారి IFFIలో ఆసక్తికరమైన ఎంపికలు ఉన్నాయి. పోలిష్ దర్శకుడు పావెల్ పావ్లికోవ్స్కీ రూపొందించిన ‘ఫాదర్‌ల్యాండ్’ ప్రారంభ చిత్రంగా ప్రదర్శితం కానుంది. రొమేనియా, జర్మనీ, బెల్జియం సంయుక్త నిర్మాణమైన ‘ఐ మ్యాటర్’ మిడ్ ఫెస్ట్ చిత్రంగా, సింగపూర్ దర్శకుడు ఆంథోనీ చెన్ తెరకెక్కించిన ‘వీ ఆర్ ఆల్ స్ట్రేంజర్స్’ ముగింపు చిత్రంగా ప్రదర్శించనున్నారు. స్పెయిన్‌కు కంట్రీ ఆఫ్ హానర్ హోదా ఇవ్వగా.. రష్యా పార్ట్‌నర్ కంట్రీగా వ్యవహరించనుంది. ఈ రెండు దేశాలకు చెందిన ప్రత్యేక చిత్రాల ప్రదర్శనలు కూడా ఫెస్టివల్‌లో ఉంటాయి.

ఈసారి IFFIలో కొత్తగా రెండు విభాగాలను కూడా ప్రవేశపెడుతున్నారు. యానిమేషన్ సినిమాల కోసం ప్రత్యేక విభాగంతో పాటు, సినిమాల నిర్మాణం, వాటి వెనుక ఉన్న ఆసక్తికరమైన కథలను పరిచయం చేసే ‘ఫిల్మ్స్ అబౌట్ ఫిల్మ్స్’ విభాగాన్ని ఏర్పాటు చేశారు. వీటితో పాటు BRICS దేశాలకు చెందిన సినిమాల ప్రదర్శనలు, అంతర్జాతీయ పోటీలు, ఉత్తమ తొలి ఫీచర్ ఫిల్మ్ పోటీలు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి. తొలిసారిగా ఉత్తమ OTT వెబ్ సిరీస్ అవార్డును కూడా ప్రవేశపెడుతున్నారు. ఈ అవార్డు విజేతకు రూ.10 లక్షల నగదు బహుమతి అందించనున్నారు.

సినిమాల ప్రదర్శనతో పాటు కొత్త దర్శకులను ప్రోత్సహించడం, సినీ పరిశ్రమలో అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేయడంపై కూడా ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టారు. 52 మంది మహిళా దర్శకులు, 62 మంది తొలి చిత్ర దర్శకులు ఈ వేడుకల్లో భాగం కానున్నారు. WAVES ఫిల్మ్ బజార్, నెట్‌ఫ్లిక్స్ భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమాలు, 14 మాస్టర్ క్లాసులు, ప్యానెల్ చర్చలు నిర్వహించనున్నారు. మొత్తంగా తెలుగు సినిమాలకు దక్కిన గుర్తింపుతో పాటు హిందీ, దక్షిణాది, అంతర్జాతీయ చిత్రాల ప్రదర్శనలతో IFFI 2026 సినిమా ప్రేమికులకు తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక అనుభూతిని అందించనుంది.

Related Articles

Latest Articles