
వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై రవి లోకిరెడ్డి రచనా దర్శకత్వంలో కిషోర్, ప్రసాద్ నిర్మాతలుగా శ్రీ మురళి కార్తికేయ సంగీతం అందించిన చిత్రం కళ్యాణం కమనీయం జీవితం. ఖాన్ దుర్రని, సాహితీ అవాంఛ జంటగా నటించిన ఈ చిత్రంలో ఉదయ్ పులిమే కాకినాడ నాని, సత్యానంద్ లంక, సోనీ రెడ్డి, ధనలక్ష్మీ బల్ల, మహీంద్ర గణాచారి తదితరులు కీలకపాత్రలు పోషించారు. వెంకట్ రాజు సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి ఉద్ధవ్ ఎడిటింగ్ చేశారు. నేడు విడుదలైన ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే..
కథ :
Gen Z యువతి సునయన తన జీవితంలో రెండు సంబంధాల మధ్య సందిగ్ధంలో ఉంటుంది. ఎవరిని ఎంచుకోవాలి? తనకు నిజమైన ప్రేమ ఎవరిది? అనే ప్రశ్నలు ఆమెను వెంటాడుతుంటాయి.
ఈ సమయంలో సముద్ర తీరంలో ఆమెకు ఒక భిక్షగాడు చెప్పే కథ ఆసక్తికరమైన మలుపుకు దారి తీస్తుంది. అది కల్యాణ్–కమనీయ అనే దంపతుల కథ. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట జీవితంలోకి రాహుల్ అనే వ్యక్తి ప్రవేశిస్తాడు. అతడి ప్రతీకారం, గతం, కుట్రల కారణంగా ఆ దాంపత్య జీవితంలో అనూహ్యమైన సమస్యలు మొదలవుతాయి. ఒక అందమైన ప్రేమకథ క్రమంగా అనుమానాలు, బాధలు, మోసాలు, సంఘర్షణలతో నిండిపోతుంది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. కల్యాణ్–కమనీయ కథకు సునయన జీవితానికి ఉన్న సంబంధం ఏమిటి? గతంలో జరిగిన సంఘటనలు వర్తమానంలో సునయన నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయి? రాహుల్ అసలు ఎవరు? అతడి గతం ఏమిటి? చివరకు సునయన తన జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
నటీనటుల నటన :
ఖాన్ దుర్రానీకి ఈ సినిమా ఒక భిన్నమైన పాత్రను అందిస్తుంది. ప్రేమ, బాధ, సంఘర్షణ వంటి భావోద్వేగాలను పలికించే సన్నివేశాల్లో అతడి నటన కథకు అనుగుణంగా సాగుతుంది. ప్రత్యేకంగా ప్రేమలో ఉన్న వ్యక్తిగా, అలాగే సంబంధాల్లో వచ్చే సమస్యలను ఎదుర్కొనే వ్యక్తిగా పాత్రలోని ఎమోషన్‌ను చూపించే ప్రయత్నం చేశారు. సాహితి అవంచ పాత్రకు కథలో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ప్రేమ, కుటుంబం, భావోద్వేగాల మధ్య సతమతమయ్యే పాత్రలో ఆమె కనిపిస్తుంది. సహజమైన నటనతో హీరోతో కెమిస్ట్రీ కూడా కథకు అవసరమైన స్థాయిలో ఉంటుంది. సినిమాలో Gen Z యువతి సునయన పాత్ర కథనానికి ప్రత్యేకమైన లేయర్‌ను జోడిస్తుంది. ప్రస్తుత తరం ప్రేమను ఎలా చూస్తోంది. కొన్ని కీలక అంశాలను కథ ద్వారా చూపించే ప్రయత్నం ఆసక్తికరంగా ఉంటుంది. సునయన వింటున్న పాత ప్రేమకథ కేవలం ఒక ఫ్లాష్‌బ్యాక్ కథ కాకుండా ఆమె జీవితంతో ముడిపడి ఉండటమే సినిమాలోని ప్రధాన ఆకర్షణ. సత్యానంద్ లంక, కాకినాడ నాని, సోనీ రెడ్డి, ధనలక్ష్మి బల్ల తదితరులు తమ పాత్రల పరిధిలో నటించారు. వీరితో పాటు కథకు అవసరమైన పాత్రలు సినిమాను ముందుకు తీసుకెళ్లడంలో సహకరిస్తాయి.
సాంకేతిక విశ్లేషణ :
దర్శకుడు రవి లోకిరెడ్డి ప్రేమకథను కేవలం ఒక సాధారణ రొమాంటిక్ డ్రామాగా కాకుండా లవ్, ఫ్యామిలీ ఎమోషన్, సస్పెన్స్ కలయికగా చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా గతంలో జరిగిన కథను ప్రస్తుత తరానికి చెందిన యువతి జీవితంతో అనుసంధానం చేయడం కథలో ఆసక్తిని పెంచే అంశం. సినిమా కథనంలో ప్రేక్షకుడికి కొన్ని ప్రశ్నలు రేకెత్తించే విధంగా కథను ముందుకు తీసుకెళ్లడం దర్శకుడి ప్రయత్నంగా కనిపిస్తుంది. ప్రేమకు సంబంధించిన భావోద్వేగాలతో పాటు, సంబంధాల్లో నమ్మకం ఎంత ముఖ్యమో చెప్పే ప్రయత్నం కూడా కనిపిస్తుంది. అయితే కథలోని ట్విస్టులు మరింత బలంగా అనిపించాయి. శ్రీమురళి కార్తికేయ సంగీతం అందించారు. ప్రేమకథకు సంగీతం చాలా కీలకం. రొమాంటిక్ సన్నివేశాలకు, ఎమోషనల్ సన్నివేశాలకు మ్యూజిక్ మరింత బలం చేకూర్చాల్సి ఉంటుంది. సినిమాలోని భావోద్వేగాలను బలపరిచేలా సంగీతాన్ని ఉపయోగించే ప్రయత్నం కనిపిస్తుంది. కథలో గతం–వర్తమానం మధ్య ప్రయాణం ఉన్నందున ఎడిటింగ్ కీలకంగా మారుతుంది. కథన వేగాన్ని నిలబెట్టడం ఈ తరహా సినిమాలకు చాలా ముఖ్యం. సినిమా ఎమోషనల్ ట్రాక్ నుంచి థ్రిల్లర్ ట్రాక్‌కు మారే సమయంలో ఉద్ధవ్ అందించిన ఎడిటింగ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. స్క్రీన్‌పై దృశ్యాలు మంచి ఫీలు అందిస్తూ సినిమాటోగ్రఫీ కూడా చక్కగా కుదిరింది.
సారాంశం :
‘కళ్యాణం కమనీయం జీవితం’ టైటిల్లోనే పెళ్లి, ప్రేమ, జీవితాన్ని ప్రతిబింబించే భావనతో ప్రేమ అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే బంధం మాత్రమే కాదని, దాని వెనుక నమ్మకం, కుటుంబం, గతం, భావోద్వేగాలు ఉంటాయని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ప్రేమకథలకు ఫ్యామిలీ ఎమోషన్‌తో పాటు కొంత సస్పెన్స్ కూడా జోడించిన సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు, జెన్‌జీ యువతకు ఈ చిత్రం అమితంగా నచ్చుతుంది.


