
సంగీత దర్శకుడు కోటి సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ యాభై ఏళ్లలో ఎన్నెన్నో బ్లాక్ బస్టర్, క్లాసికల్ పాటల్ని అందించారు. 80, 90వ దశకంలో రాజ్ కోటి ద్వయానికి ఏర్పడిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక కోటి సంగీత సారథ్యంలో వచ్చిన ఎన్నో చిత్రాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. ఈ యాభై ఏళ్ల సినీ జర్నీని పురస్కరించుకుని మనతో ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ‘కోటి 50: ది బిగ్గెస్ట్ లైవ్ కాన్సర్ట్ ఇన్ హైదరబాద్ – ది గ్రాండెస్ట్ రోర్ ఆఫ్ హిజ్ లెగసి’ ఈవెంట్‌ను నవంబర్ 28న నిర్వహించబోతోంది. ఈ కాన్సర్ట్ ను ఎస్ఎంఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్, ఎన్ ఎస్ ఆర్ డెవలపర్స్, నవీన్ గోల్డ్ అండ్ బ్రదర్స్, జీ ఎన్ ఆర్ మయూక ఇన్ ఫ్రా, కాంచీపురం లక్ష్మీ వారాహి సిల్క్స్ గ్రాండ్ గా స్పాన్సర్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం గురించి సంబంధించిన ప్రకటన చేసేందుకు సోమవారం నాడు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి గంగుల కమలాకర్ ‘కోటి 50: ది బిగ్గెస్ట్ లైవ్ కాన్సర్ట్ ఇన్ హైదరబాద్ – ది గ్రాండెస్ట్ రోర్ ఆఫ్ హిజ్ లెగసి’ ఈవెంట్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. అనంతరం..
ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ .. ‘నా చిన్నతనంలో కోటి గారి పాటలెన్నో విన్నాను. ఈ రోజు ఇలా ఆయన్ను ఇక్కడ కలవడం ఆనందంగా ఉంది. ఈ యాభై ఏళ్లలో టెక్నాలజీ ఎంతో మారింది. ఒకప్పుడు గ్రామఫోన్‌లో ఆయన పాటలు వినేవాడ్ని. ఆయన మ్యూజిక్, పాటల వల్లే చాలా సినిమాలు విజయవంతమయ్యాయి. మా తరానికి కోటి గారి గురించి చాలా తెలుసు. కానీ ప్రస్తుతం ఉన్న జెన్ జీ ఆడియెన్స్‌కి ఈ ఈవెంట్‌తో కోటి గారు అంటే ఏంటో తెలుస్తుంది. నవంబర్‌లో జరిగే ఈ కార్యక్రమానికి నేను కూడా వస్తాను. నేను తీస్తున్న చిత్రాలకు కూడా కోటి గారే సంగీతాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ భూమ్మీద గాలి ఉన్నంత వరకు కోటి గారి పాటలు నిలిచి ఉంటాయి’ అని అన్నారు.
సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ .. ‘ఈ రోజు ఇక్కడకు రావడంతోనే మా అమ్మానాన్నలు గుర్తుకు వచ్చారు. నా తండ్రి సాలూరి రాజేశ్వర్ గారికి చెడ్డ పేరు తీసుకు రాకూడదు అని ప్రతీక్షణం ఆలోచిస్తూ పని చేస్తూ వచ్చాను. నేను ప్రతీ సినిమాని, ప్రతీ పాటను మొదటి అవకాశంగానే భావించి కష్టపడి పని చేశాను. తరతరాలు గుర్తుండిపోవాలనే ప్రతీ పాటకు పని చేశాను. రాజ్ కోటిగా ఎన్నో అద్భుతమైన పాటల్ని చేశాం. ఆ తర్వాత కోటిగా నా ప్రయాణంలో గొప్ప గొప్ప పాటల్ని ఇచ్చాను. సంగీత ప్రియుల హృదయాల్లో కోటి పాటలు ఎప్పుడూ నిలిచి ఉంటాయి. ఇప్పుడు అలాంటి పాటల్ని ఎవ్వరూ క్రియేట్ చేయలేరు అని ఛాలెంజ్ చేయగలను. బీట్స్ గురించి రాజ్, నేను ఎంతో స్టడీ చేశాం. మా పాటలకు చిరంజీవి గారి బ్రేక్ డ్యాన్స్ కూడా తోడవ్వడంతో ఇప్పటికీ ప్రజాదరణ దక్కుతోంది. నవంబర్‌లో జరిగే ఈ కాన్సర్ట్‌లో అందరి హృదయాలకు దగ్గరైన పాటల్ని పాడతాం. 1984 నుంచి 1994 వరకు రాజ్ కోటి ద్వయం అందరినీ ఉర్రూతలూగించింది. ఆ తర్వాత నా ఒంటరి ప్రయాణంలో చేసిన ప్రతీ పాట హిట్ అయింది. ప్రతీ పాటను ఆడియెన్స్ ఆదరించి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టారు. నేను ఎప్పుడూ అడ్వాన్స్డ్గానే ఆలోచిస్తూ ఉండేవాడిని. నా దగ్గర పని చేసిన రెహమాన్, దేవీ శ్రీ ప్రసాద్, తమన్, హారిస్ జయరాజ్ ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉండటం ఆనందంగా అనిపిస్తుంది. ఒక్కో పాటకు ఒక్కో బీట్ ఇవ్వడం నా అదృష్టం. ఇదంతా ఆ దేవుడు, నా తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్లే జరిగింది. నా కోసం ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. నేను చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు ఇలా అందరి హీరోలతోనూ పని చేశాను. సినీ ఇండస్ట్రీ అంతా కదిలి వచ్చి నా ఈ కాన్సర్ట్‌ను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
మంజుల రావు జూపల్లి మాట్లాడుతూ .. ‘ఎన్ని కోట్లు సంపాదించినా కూడా మేం కొన్ని కాలాల పాటే అందరికీ గుర్తుంటాం. కానీ కోటి గారి లాంటి వారు మాత్రం తరతరాలకు గుర్తుండిపోతారు. ‘మనతో’ టీం నుంచి కొందరు నా దగ్గరకు వచ్చారు. ఈ ఈవెంట్ గురించి చెప్పారు. కోటి గారు అని చెప్పడంతో ఈవెంట్‌కి వస్తానని వెంటనే చెప్పేశాను. కోటి గారు ప్రతీ హీరో సినిమాకి పని చేశారు. ఇప్పటి తరానికి ఇది సాధ్యం అవుతుందా?.. ఆయన పాటలు గొంతు నుంచి కాకుండా నాభి నుంచి వస్తాయి. ఇలాంటి కార్యక్రమాలకు నా వంతు సాయం చేసే అవకాశం దొరకడం నా అదృష్టం’ అని అన్నారు.
మనతో ఎంటర్టైన్మెంట్స్ శోభన్ మాట్లాడుతూ .. ‘కోటి గారి సంగీతంతో పాటు మనం పెరుగుతూ వచ్చాం. ఆయన బీట్.. మన హార్ట్ బీట్. ఐదు దశాబ్దాలుగా ఆయన సంగీతాన్ని ఆస్వాధిస్తూనే వస్తున్నాం. ఆడియో క్యాసిట్ నుంచి ఏఐ ఇంటెలిజెన్స్ వరకు ఉన్న ఏకైకా గొప్ప సంగీత దర్శకుడు కోటి గారు. ఈ రోజు ఇలా కోటి గారి కాన్సర్ట్ గురించి ప్రకటిస్తుండటం ఆనందంగా ఉంది’అని అన్నారు.


