
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్వీబీసీ) ఆర్థిక స్వయం సమృద్ధి సాధించే దిశగా ఉద్యోగులు కృషి చేయాలని టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు సూచించారు. తిరుపతిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో టీటీడీ పాలకమండలి సభ్యులు, ఎస్వీబీసీ ఛైర్మన్ బి. శ్రీధర్ వర్మ, టీటీడీ జేఈఓ, ఎస్వీబీసీ సీఈఓ డాక్టర్ ఏ. శరత్‌తో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు మాట్లాడుతూ… “ఛానెల్ నిబంధనలకు అనుగుణంగా మరిన్ని ప్రకటనలు తీసుకురావడం ద్వారా ఆదాయాన్ని పెంచాలి, ఇందుకోసం మార్కెటింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలి” అని సూచించారు.
ఈ సందర్భంగా ఛానెల్ ద్వారా నిర్వహిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలు, ఇతర కార్యక్రమాలు, కొత్తగా చేపట్టబోయే కార్యక్రమాల వివరాలను అధికారులు ఛైర్మన్‌కు వివరించారు.
ఎస్వీబీసీ ఛైర్మన్ బి. శ్రీధర్ వర్మ మాట్లాడుతూ… “ముందుగా మాకు సహకరించి మాకోసం సమయాన్ని కేటాయించిన ఎస్విబిసికు సపోర్ట్ చేస్తున్న బి.ఆర్. నాయుడు గారికి, బోర్డు సభ్యులకు, ఇతర అధికారులకు నా ధన్యవాదాలు. ఈ మొదటి మీటింగ్ నాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. మేము ఏదైతే అనుకున్న కొన్ని మౌలిక సదుపాయాలు, పరికరాల బయట నుండి అద్దెకు తెచ్చుకుంటున్నామో అతి త్వరలో వాటిని కొనుగోలు చేసేందుకు అధికారులతో మాట్లాడతాము. టిటిడికు వివిధ మార్గాలలో ఆదాయంలో వచ్చేలా మేము త్వరలో దృష్టి పెడతాము. ఎస్వీబీసీకు నిబంధనల ప్రకారం త్వరలో సభ్యులతో సంభాషించి తగిన చర్యలు తీసుకుని ఎస్వీబీసీకు లాభదాయకంగా అన్ని కార్యక్రమాలు చేస్తాము. సోషల్ మీడియా విభాగాన్ని మరింత పటిష్టం చేసి, శ్రీవారి వైభవం, ఉత్సవాల విశిష్టత, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, టీటీడీ అనుబంధ ఆలయాల్లో జరిగే ఉత్సవ విశేషాలను నాణ్యంగా ప్రజలకు అందిస్థాము” అన్నారు.
ఈ సందర్భంగా ఎస్వీబీసీ ఛైర్మన్ బి. శ్రీధర్ వర్మ, సమావేశానికి విచ్చేసిన టీటీడీ ఛైర్మన్ బి ఆర్ నాయుడు గారికి, బోర్డు మెంబర్లకు, డైరెక్టర్లకు, అధికారులకు తమ విలువైన సమయం కేటాయించినందుకు గాను ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎస్వీబీసీకి అందిస్తున్న సహకారానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.


