డాన్సర్స్ అసోసియేషన్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ షాక్.. సహాయ నిరాకరణ ప్రకటింపు

తెలుగు సినీ పరిశ్రమలో డాన్సర్స్ అసోసియేషన్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ కీలక షాక్ ఇచ్చింది. ఇకపై డాన్సర్స్ అసోసియేషన్‌కు ఎలాంటి సహాయ సహకారాలు అందించబోమని ఫెడరేషన్ అధికారికంగా ప్రకటించింది. డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జానీ మాస్టర్ భార్య సుమలత తీరును తప్పుబడుతూ ఫిల్మ్ ఫెడరేషన్ ఒక లేఖను విడుదల చేసింది. ఆ లేఖలో చిరంజీవి తీసుకున్న నిర్ణయాలు, ఫిల్మ్ ఫెడరేషన్ మరియు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయాలను పక్కన పెట్టి ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించింది.

సస్పెండ్ అయిన సభ్యులను తిరిగి కలుపుకుపోవాలని కౌన్సిల్ సమావేశంలో అందరూ నిర్ణయించి, అందుకు మీకు అవకాశం కూడా ఇచ్చామని ఫెడరేషన్ పేర్కొంది. అయినప్పటికీ ఆ నిర్ణయాలను పాటించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. ఇకపై డాన్సర్స్ అసోసియేషన్‌కు సంబంధించిన ఎలాంటి సమస్యల పరిష్కారంలో ఫెడరేషన్ బాధ్యత తీసుకోదని స్పష్టం చేసింది. అలాగే ఫిల్మ్ ఛాంబర్‌తో జరిగే వేతనాల ఒప్పందాల విషయంలో కూడా ఎలాంటి మద్దతు ఇవ్వబోమని వెల్లడించింది.

ఫెడరేషన్ తీసుకున్న ఈ నిర్ణయానికి అనుగుణంగా మిగతా 23 క్రాఫ్ట్ అసోసియేషన్లు కూడా డాన్సర్స్ అసోసియేషన్‌కు సహాయ నిరాకరణ చేస్తాయని ఫిల్మ్ ఫెడరేషన్ తెలిపింది. ఈ పరిణామం తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

Related Articles

Latest Articles