“అదే నీవు అదే నేను” చిత్ర రివ్యూ

శ్రీ లక్ష్మీ వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్ పై కొండల్ రచన దర్శకత్వంలో కాండ్రేగుల గోవింద్ నిర్మాతగా త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, తన్వి నేగి, సహర్ కృష్ణన్, కల్పలత, సునయన, బిత్తిరి సత్తి, మీర్, సూర్యతేజ, నరేందర్, రమణ భార్గవ్, తదితరులు కీలకపాత్రలు పోషించిన చిత్రం “అదే నీవు అదే నేను”. నిమ్మల జయపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేయగా చోట కె ప్రసాద్ ఎడిటింగ్ చేసిన ఈ చిత్రానికి కనిష్క సంగీతాన్ని అందించారు. నేడు విడుదలైన ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ :
శ్రీవల్లి (తన్వీ నేగి), సాగర్ (యశ్వంత్ పెండ్యాల) కొత్తగా పెళ్లైన దంపతులు. హైదరాబాద్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో సంతోషంగా జీవిస్తుంటారు. అయితే సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో పని ఒత్తిడి కారణంగా సాగర్ భార్యకు సమయం కేటాయించలేకపోతాడు. ఇదే సమయంలో ఎదురుగా ఉన్న ఫ్లాట్‌లో కెనడా నుంచి వచ్చిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కార్తీక్ (త్రినాథ్ వర్మ) నివాసం ఉంటాడు. సరదా స్వభావం, ఆకట్టుకునే మాటలతో కార్తీక్ శ్రీవల్లికి దగ్గరవుతాడు. మొదట స్నేహంగా మొదలైన పరిచయం క్రమంగా ఆమె మనసులో గందరగోళాన్ని సృష్టిస్తుంది. పెళ్లైన మహిళ అయినప్పటికీ కార్తీక్ వైపు ఆకర్షితురాలవుతున్నాననే భావనతో శ్రీవల్లి తీవ్ర మానసిక సంఘర్షణకు గురవుతుంది. ఇదే సమయంలో కార్తీక్ ఆమెకు పెళ్లి చేసుకుని కెనడాకు వెళ్లిపోదామని ప్రపోజ్ చేస్తాడు. అయితే, సాగర్ గురించి శ్రీవల్లికి కొన్ని ఊహించని నిజాలు తెలుస్తాయి. ఆ నిజాలు ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. చివరకు ఆమె తీసుకున్న నిర్ణయం కథను ఊహించని మలుపు తిప్పుతుంది.
అసలు శ్రీవల్లికి తెలిసిన నిజాలు ఏమిటి? కార్తీక్ నిజంగా ఆమెను ప్రేమించాడా లేదా మరో ఉద్దేశం ఉందా? సినిమా ప్రారంభంలో కనిపించిన రెండు మృతదేహాల వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం తెరపై చూడాల్సిందే.

నటీనటుల నటన :
కమిటీ కుర్రోళ్లు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల ఈ చిత్రంలో కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. కార్తీక్ పాత్రలో త్రినాథ్ వర్మ తన సహజమైన నటనతో ఆకట్టుకుంటూ, పక్కింటి అబ్బాయిగా చాలా సహజంగా కనిపించారు. సాగర్ పాత్రలో యశ్వంత్ పెండ్యాల తన మెచ్యూర్డ్ నటనతో మెప్పించారు. గ్రే షేడ్స్ ఉన్న పాత్రను హుందాగా, భావోద్వేగాలతో ప్రేక్షకులకు చేరువ చేశారు.

శ్రీవల్లి పాత్రలో తన్వీ నేగి ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. అందంతో పాటు నటనలోనూ ఆకట్టుకుంటూ, భావోద్వేగాలు, సంఘర్షణలతో కూడిన ఈ పాత్రను ఎంతో నమ్మకంగా పోషించింది. రూబీ పాత్రలో సహర్ కృష్ణన్ తన గ్లామర్‌తో పాటు నటనతో కూడా మంచి మార్కులు సంపాదించింది. స్నేహ పాత్రలో సునయన, సాగర్ తల్లి సావిత్రిగా కల్పలత తమ పాత్రల పరిధిలో చక్కగా నటించి కథకు మరింత బలం చేకూర్చారు.

సాంకేతిక విశ్లేషణ :
సాంకేతికంగా ఈ సినిమా మంచి స్థాయిలో రూపొందింది. సినిమాటోగ్రాఫర్ నిమ్మల జయపాల్ రెడ్డి ప్రతి సన్నివేశాన్ని అందంగా చూపించారు. ఎడిటర్ ఛోటా కె. ప్రసాద్ కథకు అవసరమైన వేగం తగ్గకుండా సన్నివేశాలను చక్కగా కట్ చేశారు. కనిష్క అందించిన నేపథ్య సంగీతం కథలోని భావోద్వేగాలు, ఉత్కంఠను మరింత బలంగా చూపించింది. అలాగే ‘మనసా.. మనసా..’, ‘మధురమా..’ పాటలు కూడా వినడానికి ఆహ్లాదంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఆకట్టుకుంటాయి. ప్రతి సన్నివేశంలో మంచి నాణ్యత కనిపిస్తుంది. కథకు అవసరమైన విజువల్ క్వాలిటీని అందించడంలో నిర్మాత కాండ్రేగుల గోవిందు తీసుకున్న శ్రద్ధ, సినిమాపై ఉన్న అభిరుచి స్పష్టంగా కనిపిస్తుంది.

చిత్ర విశ్లేషణ :
రెండు బాడీలు శ్రీవల్లి కారులో తీసుకెళ్లే సన్నివేశంతో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. ఆమె అలా ఎందుకు చేసిందనే ప్రశ్న ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతుంది. గేటెడ్ కమ్యూనిటీ, సాఫ్ట్‌వేర్ ఆఫీస్ నేపథ్యంలో కథ సరదాగా సాగుతుండగా, సూర్యతేజ, బిత్తిరి సత్తి కామెడీ మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇంటర్వెల్ తర్వాత కథ అసలు మలుపు తిరుగుతుంది. మొదటి భాగంలో వేసిన సందేహాలకు ఒక్కొక్కటిగా సమాధానాలు ఇస్తూ, ఊహించని ట్విస్టులతో దర్శకుడు కథను ఆసక్తికరంగా నడిపించారు. ప్రతి ట్విస్ట్‌కు బలమైన కారణం ఉండటం సినిమాకు ప్రధాన బలం. ప్రస్తుత సమాజంలో జరిగే కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా తీసుకుని దర్శకుడు కొండల్ ఈ థ్రిల్లర్‌ను రూపొందించారు. క్లైమాక్స్ వరకు అసలు కథను దాచిపెట్టడం, అలాగే ఎక్కడా పోలీస్ పాత్ర లేకుండానే ఉత్కంఠభరితమైన కథను నడిపించడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.

ప్లస్ పాయింట్స్ :
కథ, ట్విస్టులు, నటీనటుల నటన, సంగీతం

మైనస్ పాయింట్స్ :
కొన్ని నెమ్మదిగా సాగే రొటీన్ సన్నివేశాలు

సారాంశం :
“పెళ్లికి ముందు ప్రేమ ‘నువ్వు లేకపోతే నేను ఉండలేను’ అని చెబితే… పెళ్లి తర్వాత అదే ప్రేమ ‘నేను జీవించేది నీ కోసమే’ అని చెబుతుంది. ఆ బంధంలోని నిజమైన ప్రేమ, త్యాగం, పవిత్రతను హృదయానికి హత్తుకునేలా చూపించే చిత్రమే ఇది.”

Related Articles

Latest Articles