గానకోకిల జానకి కన్నుమూత

దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచాన్ని తన మధుర గానంతో అలరించిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్‌. జానకి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మైసూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్తతో సంగీతాభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కొద్దినెలల క్రితం ఆమె కుమారుడు మురళీకృష్ణ మృతి చెందడంతో జానకి తీవ్ర మనోవేదనకు గురయ్యారని కుటుంబ వర్గాలు తెలిపాయి. ఈ విషాదం నుంచి పూర్తిగా కోలుకోకముందే ఆమె మరణించడం అభిమానులను కలచివేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో జన్మించిన ఎస్‌. జానకి, 1957లో విడుదలైన ‘విధియిన్ విలయాట్టు’ సినిమాతో సినీ గాన రంగంలో అడుగుపెట్టారు. అనంతరం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వేలాది పాటలు పాడి అపారమైన గుర్తింపు సంపాదించారు. ఆమె తన సుదీర్ఘ గాన ప్రస్థానంలో 50 వేలకుపైగా పాటలు ఆలపించారు.

ఎస్‌. జానకి ప్రతిభకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. అలాగే ఆమె నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులు, పది నంది అవార్డులు అందుకున్నారు. కేరళ ప్రభుత్వం నుంచి 11 రాష్ట్ర అవార్డులు, తమిళనాడు ప్రభుత్వం నుంచి 6 అవార్డులు, ఒడిశా ప్రభుత్వం నుంచి ఒక రాష్ట్ర అవార్డు కూడా అందుకున్నారు. మొత్తం మీద ఆమె కెరీర్‌లో 32కుపైగా ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు. తన ప్రత్యేక స్వరం, భావ వ్యక్తీకరణతో ఎన్నో తరాల సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎస్‌. జానకి మరణంతో భారతీయ సినీ సంగీత రంగం ఓ మహోన్నత గాన గాత్రాన్ని కోల్పోయింది. ఆమె ఆలపించిన అమర గీతాలు ఎప్పటికీ అభిమానుల హృదయాల్లో మార్మోగుతూనే ఉంటాయి.

Related Articles

Latest Articles