లోబోకు ఒక సంవత్సరం జైలు శిక్ష

ప్రముఖ టీవీ యాంకర్ మరియు ఎంటర్టైనర్ లోబో అలియాస్ మహమ్మద్ ఖయ్యుమ్, 2010లో తన విలక్షణ దుస్తుల శైలి మరియు అద్భుతమైన హోస్టింగ్‌తో తెలుగు ప్రేక్షకులలో బాగా పాపులర్ అయ్యారు. స్టార్ మా ఛానెల్‌లో ఆయన నిర్వహించిన సంగీత కార్యక్రమం అప్పట్లో ఘన విజయం సాధించింది. లోబో 100కు పైగా సినిమాల్లో నటించి, బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొని ఈ తరం ప్రేక్షకులలో కూడా పేరు గడించారు.

అయితే 2018లో జరిగిన ఒక రోడ్డు ప్రమాద కేసులో జనగామ జిల్లా కోర్టు లోబోను దోషిగా తేల్చి ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. వరంగల్‌లో టీవీ షూటింగ్ కోసం వెళ్లిన లోబో, హైదరాబాద్ తిరిగి వస్తుండగా, రఘునాధపల్లి వద్ద ఆయన నడిపిన వాహనం ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. లోబో బృందంలోని సభ్యులు కూడా గాయాలపాలయ్యారు.

రఘునాధపల్లి పోలీసులు అప్పట్లో లోబోపై రాష్ డ్రైవింగ్ కేసు నమోదు చేశారు. ఏడు సంవత్సరాల విచారణ తర్వాత, జనగామ జిల్లా కోర్టు లోబోను దోషిగా నిర్ధారించి, ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు 12,500 రూపాయల జరిమానా విధించింది.

Related Articles

Latest Articles