డ్రింకర్ సాయి చిత్ర హీరోపై వరకట్న వేధింపు కేసు

సినీ నటుడు ధర్మ మహేష్‌పై గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఆయన భార్య చిరుమామిళ్ల గౌతమి ఫిర్యాదు చేశారు. ధర్మ మహేష్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులపై కూడా ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

గౌతమి ఫిర్యాదు మేరకు సినిమా అవకాశాలు పెరగడంతో ధర్మ మహేష్ జల్సాలకు అలవాటు పడి, అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన గచ్చిబౌలి మహిళా పోలీసులు ధర్మ మహేష్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ధర్మ మహేష్, గౌతమిలకు 2019లో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. గతంలో కూడా వరకట్న వేధింపుల ఆరోపణలపై పోలీసులు మహేష్‌కు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాలేదని, వేధింపులు కొనసాగుతున్నాయని గౌతమి ఆరోపించారు.

ధర్మ మహేష్ ‘సింధూరం’ (2023), ‘డ్రింకర్ సాయి’ సినిమాల్లో కథానాయకుడిగా నటించి గుర్తింపు పొందాడు. అయితే ఈ వరకట్న వేధింపుల వ్యవహారం అతడి సినీ కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Related Articles

Latest Articles