‘సవారి’ రిలీజ్ తర్వాత పెద్ద సినిమా అవుతుంది


‘సవారి’ కంటెంట్ ఉన్న సినిమా: హీరో సుధీర్ బాబు
‘సవారి’ రిలీజ్ తర్వాత పెద్ద సినిమా అవుతుంది: హీరో శ్రీవిష్ణు

నందు హీరోగా నటిస్తోన్న ‘సవారి’ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటరులో జరిగింది. సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కాల్వ నరసింహస్వామి ప్రొడక్షన్స్ పతాకంపై సంతోష్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి కుడితి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదలవుతోంది. హీరోలు సుధీర్ బాబు, శ్రీవిష్ణు సంయుక్తంగా ట్రైలరును ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ, “ఇందులో ఒక పాట విపరీతంగా నచ్చి పది, పదిహేనురోజుల పాటు అదేపనిగా వింటూ వచ్చాను. మిగతా పాటలు కూడా బాగున్నాయి. ఇదివరకు రిలీజ్ చేసిన టీజర్, ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్ బాగా నచ్చాయి. నందు ఈ సినిమాకు పడ్డ కష్టం ఎక్కడికీ పోదు. అందరికీ ఈ సినిమా గుర్తింపు తెస్తుంది. ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఫిబ్రవరి 7న సినిమా చూస్తా. జెన్యూన్ టీం పనిచేసిన ఈ సినిమా రిలీజ్ తర్వాత పెద్ద సినిమా అవ్వాలని కోరుకుంటున్నా” అని చెప్పారు.

సుధీర్ బాబు మాట్లాడుతూ, “నందుతో ‘సమ్మోహనం’ సినిమాలో కలిసి నటించాను. మొదట అతని పాత్రకు వేరొకర్ని తీసుకుందామని డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణను అడిగాను. కానీ ఆయన నందునే కోరుకున్నారు. ఆ క్యారెక్టరులో తను చాలా బాగా చేశాడు. ఇద్దరం దాదాపు ఒకే టైంలో ఇండస్ట్రీకి వచ్చాం. అతనిలో పోరాట తత్వం ఉంది. క్యారెక్టరకు సరెండర్ అయ్యే నటుడు. ఈ చిత్ర దర్శకుడు సాహిత్ గతంలో నాకో కథ చెప్పాడు. అతను నాకు గుర్తు లేకపోయినా అతను చెప్పిన కథ నాకింకా గుర్తుంది. ఆ కథ నాకు నచ్చింది కానీ చెయ్యలేకపోయా. ‘సవారి’ కంటెంట్ ఉన్న సినిమాగా కనిపిస్తోంది. భవిష్యత్తులో సాహిత్ పెద్ద డైరెక్టర్ అవుతాడు. ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్.. అన్నీ నాకు బాగా నచ్చాయి” అన్నారు.

హీరో నందు మాట్లాడుతూ, “పోస్టర్ రిలీజ్ నుంచే ఈ సినిమాకు బజ్ రావడం హ్యాపీ. టీజరుకు చాలా వ్యూస్ వచ్చాయి. ఫస్ట్ రిలీజ్ చేసిన ‘నీ కన్నులు’ పాటకు అనూహ్యమైన స్పందన లభించింది. సోషల్ మీడియాలో ఆ సాంగ్ వైరల్ అయ్యింది. డబ్బుల కోసం నేను చాలా సినిమాలు చేశాను. అవి నాకు యాక్టరుగా మంచి అనుభవాన్నిచ్చాయి. ‘100% లవ్’, ‘పెళ్ళిచూపులు’, ‘జయ జానకి నాయక’, ‘సమ్మోహనం’ సినిమాల్లో మంచి రోల్స్ చేశాను. ‘సమ్మోహనం’ తర్వాత మళ్లీ మంచి సినిమా చెయ్యాలనే ఉద్దేశంతో ఏడాది పాటు గ్యాప్ తీసుకుని నేను చేసిన సినిమా ‘సవారి’. సాహిత్ చాలా బాగా సినిమా తీశాడు. తొలికాపీ చూసుకుని సెలబ్రేట్ చేసుకున్నాం. యు.ఎస్.లో ఉండే నిర్మాతలు అక్కడ ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు. అక్కడ ఈ సినిమాకు ప్రీమియర్స్ వేస్తుండటం గొప్ప విషయం. ఇకనుంచీ మంచి సినిమాలే చేస్తాను” అని చెప్పారు.

హీరోయిన్ ప్రియాంకా శర్మ మాట్లాడుతూ, “నన్ను నమ్మి ఇందులో హీరోయిన్ పాత్రను ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ సినిమాకు పనిచెయ్యడం గొప్ప అనుభవం. మూవీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా” అన్నారు.

డైరెక్టర్ సాహిత్ మోత్కూరి మాట్లాడుతూ, “ట్రైలర్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. ఈ సినిమాని మా అన్నయ్య, నా ఫ్రెండ్ కలిసి నిర్మిస్తున్నారు. నటులందరూ బాగా చేశారు. అందరం ఈ సినిమా కోసం చాలా శ్రమించాం. ఇందులోని రెండు పాటలు కలిసి 10 మిలియన్ వ్యూస్ సాధించడం చిన్న విషయం కాదు” అని చెప్పారు.

ఈ ఈవెంట్‌లో నటులు శివ, జీవన్, మ్యాడీ, శ్రీకాంత్ రెడ్డి, బల్వీందర్, గేయరచయిత పూర్ణాచారి, గాయకుడు కరీముల్లా, ఎడిటర్ సంతోష్ మేనం మాట్లాడారు.
ఈ చిత్రానికి పాటలు: రామాంజనేయులు, శేఖర్ చంద్ర, పూర్ణాచారి, కాసర్ల శ్యాం, శ్రీరాం, సంగీతం: శేఖర్ చంద్ర, సినిమాటోగ్రఫీ: మోనిష్ భూపతిరాజు, ఎడిటింగ్: సంతోష్ మేనం, ప్రొడక్షన్ డిజైనర్: అభిజీత్ గుముదవెల్లి, నిర్మాతలు: సంతోష్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి కుడితి, రచన-దర్శకత్వం: సాహిత్ మోత్కూరి.