అల్లు అరవింద్ గారూ…

మొన్న వీడియోలో వర్మ గారి మీద కారాలు మిరియాలు నూరుతూ, పవన్ కళ్యాణ్ గురించి మీరు ఆవేదన చెందడం చూశాను.

కమర్షియల్ సినిమా తీస్తే ఖర్చులైనా వస్తుందో లేదో తెలియని కాలంలో, లో-బడ్జెట్ సినిమాలు తీస్తే విడుదలకు థియేటర్లే దొరకదు.

సినిమా వ్యాపారం కొత్త పుంతలు త్రొక్కిస్తున్నారు వర్మగారు. మీరు ఊహిస్తున్నట్టే వెనక ఎవరో వుండి పవన్ కళ్యాణ్ సైజు తగ్గించడానికి ప్లాన్ చేసి వుంటే సినిమా తీసే ఖర్చు ముందే వర్మకు వచ్చేసి వుండడమే కాకుండా ఇంకా పెద్ద మొత్తంలో గిట్టుబాటు అయివుంటుంది. ఇప్పుడు ఎవడి దయా దాక్షిణ్యాల మీదా ఆధారపడకుండా.. నేరుగా తన ఒటీపీతో టికెట్టు పెట్టు వచ్చేది అధనం.

ఒకరి గురించి కించపరుస్తూ తియ్యడం & సొమ్ము చేసుకోవడం తప్పు అని నేను భావిస్తున్నా. కానీ వర్మగారు తన సంపాదనకు ఈ మార్గాన్ని ఎంచుకొన్నాడు. ఇందులో కులాన్ని నమ్ముకోనందుకు కొంత సంతోషించాలి.

సంపాదనకు సినిమా గ్లామర్ పెట్టుబడి పెట్టి రాజకీయాల్లోకి వచ్చి, మేము గెలవకపోయినా పర్లేదు, పలానా వారిని ఓడించాం అని ఆనందంగా మీరు చెప్పినప్పుడు… ఇలాగే మీలా బాధపడ్డ జనం ఎందఱో.

మళ్లీ జనసేన పేరుతో వచ్చారు. ఎయిర్పోర్టులో విన్నాను అవినీతి గురించి అని & లోకేష్ గురించి కించపరిచాడు. అప్పుడు వారి కుటుంబం & బంధువులు కూడా ఇలా బాధపడి వుంటారు.

ప్రజారాజ్యం అప్పుడు మామిడి తోపుల్లో కుల సమావేశాలు పెట్టారు నాగబాబు గారు. సీట్లు అమ్ముకొన్నారని మీ పార్టీ నుండి బయటకు వెళుతూ ఆరోపించారు కొందరు. అయినా 18 సీట్లు వచ్చాయి. ఆ నమ్మకాన్ని ఎవరి మీద పోరాడ్డానికి రాజకీయాలలోకి వచ్చారో వారి పాదాల దగ్గర తాకట్టు పెట్టారు.

అంటే ఆ 18 సీట్ల నమ్మకాన్ని కోల్పోయారు.

దాన్ని నిలబెట్టుకోడానికి ఎటూ స్థానిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తున్న టిడిపి వస్తుంది.. విభజనతో విడిపోయిన ఆంధ్రా చంద్రబాబు వైపు చూస్తోంది అని ఆయనకు మద్దతు ఇచ్చి… మళ్లీ నమ్మకాన్ని సంపాయించడానికి కృషి చేశారు.

తీరా ఎన్నికల సమయంలో.. ఆ నమ్మకం నిలబడలేదు. మీ ఆశలను నేలపాలు చేశారు. కానీ పవన్ కళ్యాణ్ వెనుక రాంగోపాల్ వర్మకు లాగా ఎవరన్నా చంద్రబాబు సైజ్ తగ్గించాడానికి కృషిచేశారా అని మీలా ఎవరూ వచ్చి అక్కసు కక్కలేదు.

ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ను కించ పరుస్తూ సోషల్ మీడియాలో పెడితే.. ఆయన అభిమానుల పోరాడుతున్న సమయంలో.. మీ కుటుంబ సభ్యులు కూడా భాగస్వామ్యం వున్న మా టీవీ బిగ్ బాస్ షోలో ఆ వ్యక్తికి అవకాశం ఇచ్చారు పార్టిసిపెంట్‌గా. ఇది మీ కుటుంబ సభ్యులకు తెలియకుండా జరిగి వుంటుందా?

రక్త చరిత్ర నుండి ఈ సంపాదన మీద రుచిమరిగిన వర్మగారు ఇంతటి వరకు వచ్చారు.

చంద్రబాబు పాలనలో ముద్ర గడ గారు కాపు రిజర్వేషన్ కోసం పోరాడుతుంటే, స్టార్ హోటల్ దాకా వచ్చి మెగా స్టార్ గారు మీడియా సమావేశం పెట్టి మద్దతు ప్రకటించారు. అదే చిరంజీవి గారు తన సైరా సినిమా ప్రమోషన్లలో భాగంగా జగన్ రెడ్డి గారిని తాడేపల్లిలో సతీసమేతం గా కలిసి సత్కారం చేసినప్పుడు.. అగ్రవర్ణ కోటాలో చంద్రబాబు కాపులకు ఇచ్చిన రిజర్వేషన్ కోటా అమలు గురించి అడగడానికి నాలుకరాలేదు. కానీ అదే నాలుకతో పరిపాలన బావుంది అని పొగడ్డానికి మనసొచ్చింది. మళ్లీ సినీ పరిశ్రమ షూటింగ్ అనుమతులకోసం కలిసినప్పుడు అయినా ఓ ఐదు నిమిషాలు ప్రత్యేకంగా సమయం అడిగి ప్రస్తావించి వుండవచ్చు కదా. అప్పుడూ నోరు రాలేదు. కానీ అప్పుడు కూడా పరిపాలన గురించి ప్రశంశలు కురిపించారు.

పరిపాలన ఇంత బాగా వుందని అన్నకు అనిపించినప్పుడు, తమ్ముడు పార్టీని ఎవరు ఆదరిస్తారు సార్. ఆయన సైజును తగ్గించేస్తున్నారని పవన్ కళ్యాణ్ అభిమానుల అండ మీ కుటుంబంలోని హీరోల కోసం సంపాయించే ఆవేదనగా అనిపిస్తోంది, మీ బాధ.

తమ మీద నమ్మకం కోల్పోయి.. సంపాదనకు వక్ర మార్గాలు ఎవరు ఎంచుకొన్నా తప్పే. అది జనానికి నష్టం చేసే మరింత తప్పు. రెంటి మధ్య తేడా తెలుసుకొంటే మరింత ఆవేదన కలుగుతుంది మానవత్వం వున్న మనుషులకు ఎవరికైనా. #చాకిరేవు.